Thursday, May 21, 2009

ఆరోగ్యశ్రీ : పాజిటివ్ ప్రైవెటైజేషన్ ?!?

"ప్రజలకు కావలసిన అత్యుత్తమ స్థాయి వైద్యం పైసా ఖర్చులేకుండా జరుగుతుంటే ఆరోగ్యశ్రీ అన్యాయం అంటావేమిటి?" అని ఒక మిత్రుడు రాజశేఖర్ రెడ్డి విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ అడిగారు. నిజమే! ఒకవైపు నాణ్యమైన సేవల్ని, సౌకర్యాల్ని ఇవ్వలేని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలు కష్టాలు పడే బాధ తప్పింది. అందరి ద్రాక్షల్లాంటి కార్పొరేట్ వైద్యం తీగందించి పేదోళ్ళ నోట్లో తియ్యటి ద్రాక్షల్ని నింపుతోంది. పైసా ఖర్చు లేకుండా పేదోడికి ఉత్తమప్రమాణాలున్న వైద్యం ప్రాణాలు కాపాడుతోంది. మరి ఇందులో సమస్యేమిటి?

సమస్య లేదనుకోవడమే ఇక్కడ సమస్య. వైద్యరంగంసంస్కరణల నేపధ్యంలో అరోగ్యశ్రీ ఒక aberration. ప్రభుత్వ వైద్యవ్యవస్థను బాగుపరచాలనుకునే ఆశయాలకొక గొడ్డలిపెట్టు. ఇప్పటికే దాదాపు 80% ప్రైవేటు రంగంలో ఉన్న వైద్యసేవల్ని పూర్తిస్థాయిలో ప్రైవేటు పరం చేసి, ప్రైవేటు సంస్థలకు సిల్వర్ ప్లేట్లో వందశాంతాన్ని అందజేసే కుట్రలో భాగం. కానీ ఇదొక ప్రజాదరణ పొందిన కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్ నమూనాను మరిన్ని రాష్ట్రాలు త్వరలో అమలు చెయ్యడానికి పూనుకొన్నంతటి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అందుకే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీక "పాజిటివ్ ప్రైవెటైజేషన్" అనాల్సొచ్చింది.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆసుపత్రుల్లో మెరుగైన సేవలకోసం నామమాత్రపు యూజర్ ఛార్జిలు పెడితే, ఆ చర్యను ప్రైవెటైజేషన్ పేరుతో పీకిపాతరేసిన వై.ఎస్.ఆర్ కొనసాగిస్తున్న ఈ పరోక్ష ప్రైవెటైజేషన్ మాత్రం విన్నూత్నమవడం విచిత్రమే. ఈ కార్యక్రమం ప్రజాదరణ పొందడంలో ఆశ్చర్యం లేదుగానీ, ఈ రంగంలో స్థిరమైన పాజిటివ్ మార్పు కోరుకునే మేధావులూ, ప్లానర్లూ, వ్యూహకర్తలూ నిశ్శబ్ధం వహించడం మాత్రం షాకింగ్ గా ఉంది. ఈ నిశ్శబ్ధానికి వీరు చెప్పే సమాధానాలు self defeating గా ఉన్నాయన్న స్పృహకూడా లేకుండా కొందరు వివరణ ఇవ్వబూనడం మరింత హాస్యాస్పదం.

వీరు ముఖ్యంగా చెప్పేదేమిటంటే ప్రైవేటు రంగంలో ఉన్నన్ని సాంకేతిక సౌకర్యాలు,నిపుణత ప్రభుత్వరంగంలో రావాలంటే మరో 20 సంవత్సరాలు పడుతుంది. అది చాలా ఖర్చుతో కూడుకున్నపని. కాబట్టి ఇలాంటి సూపర్ స్పెషాలిటీ ఇప్పటికే ఉన్న ప్రైవేటు రంగానికి పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా ఇవ్వడం సమంజసం అనేది వీరి వాదన. ప్రస్తుతానికి ఈ విధానం బాగానే ఉంది. మరి వచ్చే 20 సంవత్సరాలలో ప్రభుత్వరంగ ఆసుత్రుల్ని సూపర్ స్పెషాలిటీ చెయ్యడానికి ప్రణాళిలున్నాయా? అని అడిగితే మాత్రం నీళ్ళునములుతారు. ఈ వివరాల్ని చెప్పిన పరిశోధనలు ఎవరు చేశారన్న ప్రశ్నకి మౌనమే సమాధానం.

అంటే అతిముఖ్యమైన ఖర్చుఎక్కువా ఆదాయం తక్కువైన ప్రాధమిక ఆరొగ్యసేవల్ని వ్యయప్రయాసలకోర్చి ప్రభుత్వరంగం నడుపుతుంది. డబ్బులు దండుకోవడానికి ‘హైకాస్ట్ హెల్త్’ సూపర్ స్పెషాలిటీ పేరుతో ప్రైవేటు రంగం పాలవ్వాలి. ఇప్పుడ్యు ఆరోగ్యశ్రీ పేరుతో ప్రభుత్వ ఆసుపత్రిలను బాగుపరచడానికి ఖర్చుపెట్టవలసిన డబ్బంతా ప్రైవేటువారికి తినిపిస్తుంది. భవిష్యత్తులో చేతులెత్తేసి, ప్రజల్ని ప్రైవేటు హాస్పిటళ్ళపరం చేస్తుంది. ఇదేగా మన గొప్ప సంస్కరణ!

నిజానికి పదిహేను సంవత్సరాల క్రితం పరిస్థితి చూస్తే ప్రభుత్వ బోధనా వైద్యశాలలు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా పేరుగాంచాయి. కానీ ఒక పద్ధతి ప్రకారం డాక్టర్ల జీతాలు పెంచక, సరైన సౌకర్యాలు కల్పించకా ప్రైవేటురంగం వైపుగా పంపించారు. ఇప్పుడు అదే expertise తక్కువయ్యిందనే కారణం చూపి రోగుల్నీ అక్కడికే పంపుతున్నారు. అదీ డబ్బులిచ్చి మరీ. ఆంటే పద్ధతి ప్రకారం ప్రభుత్వరంగాన్ని పనికిరాకుండా చేసి ప్రైవేటుకు ధారాదత్తం చెయ్యడమేగా లక్ష్యం.

అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రభుత్వం వైద్యంపై పెట్టే ఖర్చుకన్నా, ప్రజలు తమ ఆరోగ్యంపై పెట్టుకునే ఖర్చు ఎక్కువ. భారతదేశంలోనూ అదే పరిస్థితి. మారుమూల పల్లెలనుంచీ పట్నాలదాకా ఆర్.ఎం.పీ లకూ, ప్రైవేటు డాక్టరలకూ, వైద్యపరీక్షలకూ, మందూమాకుకూ సామాన్యప్రజలు పెట్టే ఖర్చు చూసుకుంటే ప్రభుత్వం పెట్టే ఖర్చుకన్నా కనీసం తొమ్మిది రెట్లు ఎక్కువుంటుంది. మన ప్రభుత్వాలు వైద్యరంగానికి కేటాయించే బడ్జెట్ GDP లో 0.9% దాటిన పాపాన ఎప్పుడూ పోలేదు. ఇప్పుడు టార్గెట్ 2-3% అంటున్నారు. కానీ ఇలా భవిష్యత్ ప్రణాళిలు లేని పబ్లిక్-ప్రైవేటు భాస్వామ్య కార్యక్రమాలు కొసాగిస్తే చివరికి మొత్తం ప్రభుత్వ ధనంకూడా ప్రైవేటువాళ్ళకిచ్చేసి వాళ్ళనే వైద్యరంగాన్ని నడపమనే పరిస్థితి రావచ్చు.

ఇక్కడ ప్రైవేటు రంగం వారి తెలివిని అభినందించాలి. వీళ్లు preventive and primary health care లోకి ఛస్తే అడుగుపెట్టరు. ఎందుకంటే అక్కడ కష్టమెక్కువ అమ్యామ్యా తక్కువ. పైగా 80% సాధారణ రొగాల్ని ఆస్థాయిలో అడ్డుకట్టవెయ్యగలిగితే వీరికి పనిలేకుండాపోతుందాయె. అంటే రోగాల్ని ఆపడంలో వీరికి అస్సలు ఆసక్తి లేదు. రోగాలుండి అవి పెచ్చరిల్లితేనే కదా వీరికి లాభాలు. వీరి ముఖ్యమైన పెట్టుబడల్లా ఆధునిక పరికరాలని దిగుమతి చేసుకుని "కొత్త వైద్యాన్ని కనిపెట్టి" ఖర్చుపెంచడం. ఒక గుండెకు సంబంధించి శస్త్రచికిత్సకు ఖర్చెంతవుతుందనే ఖచ్చితమైన అంచనాలు ఎవరైనా చెప్పగలరా? ప్రైవేటువారు ఎంత చెబితే అంత. ఈ ధరల్ని నిర్ణయించడంలోని శాస్త్రీయత ఎంత? దీనిపైన ఎవరి నియంత్రణైనా ఉందా? అనేవి ఎవరూ అడగని, అడగకూడని ప్రశ్నలు.

వైద్య,ఆరొగ్యరంగం మొత్తం భారతదేశంలోనే ఒక మాయాజాలంగా తయారయ్యింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ముగ్గురు మంత్రులు, ముగ్గురు సెక్రెటరీలు,దాదాపు ఏడుమంది కమీషనర్లతో మాయను మించిన మహేంద్రజాలంగా తయారయ్యింది. ఈ పరిస్థితుల్లో సంస్థాత,వ్యవస్థాత సంస్కరణలు నిజంగా ప్రజలకు ఆరోగ్యాన్ని అందించేవిగా ఉంటాయా అనేది ఒకపెద్ద ప్రశ్న.

*****

29 comments:

Anonymous said...

Out of curiosity, I would like to know your stand on "providing health is important and is it through public sector or private sector is irrelevant".. I am just asking your stand:)...

కత్తి మహేష్ కుమార్ said...

@ఆత్మకథ: వైద్యాన్ని అందించడం అత్యంత ముఖ్యం. అందులో సందేహం లేదు. కానీ వైద్యరంగాన్ని చంపి భవిష్యత్తుని అంధకారం చేసి, ప్రస్తుతానికి ప్రజలకు వైద్యాన్ని అందిస్తాననడంలోని ఔచిత్యాన్ని ప్రశ్నించక తప్పదు.

ఆరోగ్యశ్రీ పధకం ద్వారా కొన్ని వందల జీవితాలు రక్షింపబడ్డాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ భవిష్యత్ ప్రణాళిక లేకుండా, ఇదే సేవల్ని ప్రభుత్వరంగం అందించే ఏర్పాట్లు చెయ్యకుండా ఇలా ఎంత కాలం కొనసాగిస్తారు? ఎంత డబ్బు ప్రైవేటు "సేవలకు" ధారపోస్తారు అనేది ప్రశ్న.

ప్రైవెటీకరణ భవిష్యత్తు ఎలావుంటుందో, ఇన్స్తూరెన్స్ కంపెనీలు నడిపే అమెరికన్ వైద్యవ్యవస్థను చూసి మనం జాగ్రతపడాలి.ప్రభుత్వరంగంలో నాణ్యమైన సేవల్ని అత్యంత అందుబాటులో అందివ్వాలంటే బ్రిటిష్ వైద్యరంగం నుంచీ నేర్చుకోవాలి. మనం ఏ నమూనాలో మన భవిష్యత్తును చూస్తున్నాం అనే స్పృహ లేకుండా ఇలా తూతూ మంత్రాలు పఠిస్తూపోతే కొన్ని ప్రాణాలు ప్రస్తుతానికి రక్షింపబడ్డా భవిష్యత్తులో కొన్ని లక్షల/కోట్ల జీవితాలు నాశనమవుతాయనేది గుర్తు పెట్టుకోవాలి.

మేధ said...

కరెక్ట్ గా చెప్పారు.. అదీ కాక, అసలు పేషెంట్సే లేకుండా, డబ్బులు తీసుకునే కేసులు ఎన్నో!

ప్రభుత్వం కూడా, నిజాయితీగా పని చేయాలనే ఉద్దేశ్యం ఉంటే (వాళ్ళకి లేదు, అది వేరే విషయం!!) ఎప్పటికప్పుడు ఈ ఆసుపత్రుల మీద తనిఖీలు పెట్టాలి.. ఏ రోగానికి ఎంత తీసుకుంటున్నారు ఇలాంటివి.. మామూలు ఖరీదు కాకుండా, ఎక్కువ తీసుకుంటున్నారని సందేహం వచ్చిన వాటికి చెల్లింపులు ఆపేయాలి, వాటికి కేసులు రిఫర్ చేయకుండా ఆపాలి..

అయితే పైన చెప్పినవన్నీ, ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో ఉన్నప్పుడు అమలు చేయచ్చేమో కానీ, అసలు వాళ్ళ ముఖ్యోద్దేశ్యమే ప్రైవేటు వాటిని బాగుచేయడం! కాబట్టి ఇంకా రాన్రాను పరిస్థితి అధ్వాన్నమవుతుంది తప్ప మెరుగుపడడానికి ఆస్కారమే లేదు!

హరే కృష్ణ . said...

pranam kante viluva ayinadi prapancham lo edi ledu ..maro 5 yrs tharvatha emavutundo choodali

chavakiran said...

http://content.healthaffairs.org/cgi/reprint/4/1/41.pdf

Anonymous said...

Rabikind Tablet 2/-. Same drug from other companies ranges from 6/- to 10/-. No doctor prescribes Rabikind due to huge commissions.

Naaku telisindi idi. Teliyanivi enno. - sundaram

కత్తి మహేష్ కుమార్ said...

@చావా కిరణ్: చాలా మంచి డాక్యుమెంట్ ఇచ్చారు. అందులోని అత్యంత కీలకమైన వాక్యాల్ని చూస్తే.."The real difference between the two countries lies
in the criteria used for rationing. In the United States, “several million Americans lack adequate insurance
cover or personal means and therefore face obstacles to obtaining hospital
care.” In other words, access to health care is rationed. In Britain, in
contrast, there is no attempt to ration access according to means." వెల్ఫేర్ స్టేటైన మనం ఎంచుకుంటున్న అమెరికా నమూనా ఎంత మందిని పేదరికం కారణంగా exclude చేస్తుందో అన్న భయం వేస్తుంది.

డబ్బులుంటేతప్ప వైద్యం అందని పరిస్థితి మనదేశంలో వస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది. అందుకే ఈ ప్రైవెటీకరణను వ్యతిరేకించలేకపోయినా పేదవారి అవసరాల్ని తీర్చేవిధంగా మన విధానాలు తయారు కావాలి. ఈ ప్రయత్నంలో భాగంగా మరిన్ని చర్చలు అన్ని స్థాయిల్లోనూ జరగాలి.

@హరేకృష్ణ:నిజమే! ప్రాణంకంటే విలువైంది ఏదీ లేదు. కానీ గౌరవప్రదంగా చావడం కూడా ముఖ్యమే. భవిష్యత్తులో ఈ విధానాలు ఇలాగే కొనసాగితే, పేదవాడు డబ్బులేక అనారోగ్యంతో కొన్ని వేల చావులు ఒక్క జీవితంలో చావాల్సి వస్తుంది. మీ మాటల్లోని ఉదాసీనత నాకు చికాకుని చెప్పించింది.

Anonymous said...

hmm...

As i expected, you have not answered my question:)...
So, I am changing my question...
Why do you expect health-care should always come from public-sector??Why shouldn't it come from private sector?

భవాని said...

మేధగారు చెప్పినట్లు వీళ్ళ లక్ష్యం ప్రైవేట్ ఆస్పత్రులను బాగుచేయటం. ప్రైవెటీకరణ చేసినా వీళ్ళు వైద్యానికయ్యే ఖర్చులు ఎంతమేరకు నియంత్రిస్తారో సందేహమే. సందేహం లేదు. వీళ్ళు నియంత్రించరు. ఇందులో మాత్రం మనం అమెరికాకు దగ్గరగా వెళుతున్నాం. రానున్న కాలంలో ఎలా ఉంటుందో తలుచుకోటానికే భయం వేస్తుంది.

కత్తి మహేష్ కుమార్ said...

@ఆత్మకథ: బహుశా నా తెలుగు మీకు అర్థం కాలేదనుకుంటాను. ఈ సారి ఇంగ్లీషులో ప్రయత్నిస్తాను. Heath CARE as SERVICE can never come from private sector because its' a BUSINESS for them. As per the cost you pay they provide the service. They don't serve, they only compensate with their service for your cash. This works very well with rich. Actually this is precisely what is needed for them.

But...BUT India being a poor country with almost half of it's population living below poverty line (BPL)with less than a dollar a day and residing in Villages with limited access to basic amenities, it needs a health care system that cares not asks for money before addressing their BASIC needs.

India being a welfare state, its responsibility towards it's people is to take care of them. health,Education and livelihood are the bare-minimums that a state MUST provide to its citizens as a duty.

"The private
sector health care is unregulated pushing the cost of health care up and making it
unaffordable for the rural poor." Even in such scenario more than Rs. 100,000 crores is being spent annually as household expenditure on
health, which is more than three times the public expenditure on health.Can private sector compensate for it? Actually they are the ones who squeezing that money out of household pockets.

In such circumstances how can I expect health CARE to come from Private sector? Why should they actually CARE for people?

So, as a citizen of this country I seek state to take responsibility of its responsibilities of delivering HEALTH to its people. That too rightfully,methodically and that too without damaging further prospects of the sector's deliverability.

If you are still not convinced please rephrase you question again and put forth. I am ready to answer.

భావన said...

మహేష్... చాలా మంచి టపా. చావా గారిచ్చిన డాక్యుమెంట్ బాగుంది.
ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం నర జాతి మొత్త పర పీడన పరాయణం..
"కానీ ఇలా భవిష్యత్ ప్రణాళిలు లేని పబ్లిక్-ప్రైవేటు భాస్వామ్య కార్యక్రమాలు కొసాగిస్తే" నిజం గా మన నయకులలో సొంత భవిష్యత్తు తప్ప సమాజపు భవిష్యత్తు చూశే వాళ్ళు ఎవరు వున్నారు.. మనం నాయకులను కుల ధన మత ఆకార వికారాలను చూడకుండా ఎన్నుకోగలిగిన రోజు మనకు "ప్రజలకు కావలసిన అత్యుత్తమ స్థాయి వైద్యం పైసా ఖర్చులేకుండా జరుగుతుంటే ఆరోగ్యశ్రీ అన్యాయం అంటావేమిటి?" స్థాయి కాక వేరే ఆలోచనలు వస్తాయి... మనం ఇంకా ఆ భూస్వామ్య వ్యవస్త లోనే వున్నాము దురదృష్టం కొద్దీ..

భవాని said...

జపానులో ఆరోగ్యసేవలు 80% ప్రైవేటీకరణ చేశారట. ప్రతి సంవత్సరమూ ఆ ప్రభుత్వం వైద్యసేవల ధరలపట్టిక విడుదల చేస్తుందట. అందులో ధరల ప్రకారమే వైద్యుడు వసూలు చెయ్యాలట. ఒకవేళ అనవసరంగా ఖరీదైన పరీక్షలు చేసి డబ్బులు వసూలు చేద్దామని అనుకున్నా - ఆ పరీక్షలకు చెల్లించే ధర తరువాతి సంవత్సరం పడిపోతుందట. కొసమెరుపేంటంటే అక్కడ 50% ఆస్పత్రులు దివాళా తీసే దిశగా నడుస్తున్నాయట. ప్రభుత్వం కొంచెం ధరలు పెంచి వాటిని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందట. మనవాళ్ళు ఇలా చేస్తారా?

అబ్రకదబ్ర said...

ఒకట్రెండు సోషలిస్టు దేశాల్లో తప్ప ప్రపంచంలో మిగిలిన అన్నిచోట్లా కొద్దో గొప్పో తేడాలతో ప్రజారోగ్యం కాసులు రాల్చే మంత్రదండమే. అదో విషవలయం.

కత్తి మహేష్ కుమార్ said...

@అబ్రకదబ్ర: సోషలిస్టు దేశాల్లోనే కాదు బ్రిటన్,కెనడా వంటి క్యాపిటలిస్ట్ దేశాల్లోకూడా ప్రజారోగ్యం ప్రభుత్వం బాధ్యతే. అమెరికాలోకూడా ఒకప్పుడు హిలరీ క్లింటన్ కమ్యూనిటీ మెడిసన్ అని చెప్పిన్నా, ప్రస్తుతం పాపం ప్రైవేటు ఇన్స్యూరెన్సు కంపెనీలకు అమ్ముడుపోయి ఆ ఊసెత్తడం లేదు.

భావన said...

"అమెరికాలోకూడా ఒకప్పుడు హిలరీ క్లింటన్ కమ్యూనిటీ మెడిసన్ అని చెప్పిన్నా, ప్రస్తుతం పాపం ప్రైవేటు ఇన్స్యూరెన్సు కంపెనీలకు అమ్ముడుపోయి ఆ ఊసెత్తడం లేదు."
అమెరికా లో వైద్యం ప్రైవేటు పరమైనా ఇన్స్యూరెన్స్ వున్నా లేక పోయినా మనకు వొంట్లో బాగోక వెళితే నేను చూడను డబ్బులు తే ముందు అని మాత్రం అనరు, క్వాలిటి కూడాడబ్బు కట్టలేని మూలం గా ధర్మాసుపత్రుల లా చూడరు ( అందుమూలం గానే మూతపడిన హాస్పిటల్స్ వున్నాయి అనుకోండి యాజమాన్యం తరుపున మాట్లాడితే) ఇంక వైద్యం ప్రభుత్వ పరం చేస్తుంది బ్రిటన్ అండ్ కెనడా అంటే కెనడా సోషలిస్టిక్ కంట్రి అనొచ్చు స్తూలం గా (మరీ అమెరికన్ సిటిజెన్ లా మాట్లాడినట్లు అనిపిస్తే సారి :-)).
కాక పోయినా బ్రిటన్ లో మీరు టీవి పెట్టున్నందుకు టాక్సు ఇంటి ముంది గడ్డి వున్నందుకు టాక్సు అసలు దొడ్డి వున్నందుకు టాక్సు కట్టడం లేదా మరి వాళ్ళు... ఇక్కడ విషయం కేవలం వైద్య విధానం గురించే మొత్తం వ్యవస్త గురించి కాదు అంటే నేనేమి చెప్పలేను.

teresa said...

"అమెరికా లో వైద్యం ప్రైవేటు పరమైనా ఇన్స్యూరెన్స్ వున్నా లేక పోయినా మనకు వొంట్లో బాగోక వెళితే నేను చూడను డబ్బులు తే ముందు అని మాత్రం అనరు, క్వాలిటి కూడాడబ్బు కట్టలేని మూలం గా ధర్మాసుపత్రుల లా చూడరు ( అందుమూలం గానే మూతపడిన హాస్పిటల్స్ వున్నాయి"

--- Very true!
సాధారణంగా జరిగేదేమంటే్ ప్రైవేట్‌దాక్టర్ల దగ్గర అపాయింట్మెంట్‌ దొరకదు గనుక వీళ్ళంతా ER కొచ్చి వైద్యం చేయించుకుంటారు, నాన్‌ ఎమర్జెన్‌సీ నలతలక్కూడా.పెద్ద మొత్తాల్లో వసూలు కాని ఈ బిల్లుల వల్ల కొన్ని డిపార్ట్మెంట్సూ, ఒక్కో సారి మొత్తం ఆసుపత్రీ మూసే పరిస్థితి.. ఎంతో కొంత ఆస్తి ఉన్న దిగువ మధ్య తరగతి వాళ్ళకి కష్టం గానీ అసలేమీ లేని పేదలకి బ్రహ్మాండమైన కేర్‌ లభిస్తుంది ఫ్రీగా!

కత్తి మహేష్ కుమార్ said...

@భావన & తెరెసా:ప్రైమరీ కేర్ లేదా ఎమర్జెన్సీ రెస్పాన్స్ గురించి కాదు. హైటెక్ హెల్త్ కేర్ సర్వీసెస్ గురించి చెప్పండి. ఇన్సూరెన్స్ కవర్ లేదా ఆర్థిక బలిమి లేకుండా ఎవరైనా ముట్టుకుంటారా?

Anonymous said...

చర్చ అదుర్స్.... ఆ పిడిఫ్ చదవలేదు గానీ, బ్రిటన్, కెనడాలలో ఎలా ఉంది ఒకసారి వివరించగలరా.

ఇది నిజంగా చాలా ముఖ్య విషయం.

౧. పేద వాడి పెద్ద రోగాలకి ఆరోగ్యశ్రీ బానే ఉంది; కానీ రోజు వారి రోగాలకి ప్రభుత్వం ఏం చేస్తోంది! ఖచ్చితంగా అది ప్రభుత్వమే నెత్తినేసుకోవాలి నా అభిప్రాయం కూడా!

౨. పూర్తిగా ఇంసూరెన్స్ మోడ్ లోకి వెళ్ళినా, అసలే ఇంసూరెన్స్ లేకపోయినా , మధ్యతరగతి కూడా నిలబడలేదు...అసలే మధ్యతరగతిలో పెద్దరోగాలు ఎక్కువగా రాబోతున్నాయి; పేదవాడిలాగా కనీసం వీడు "ఇగ్నొరన్స్ ఈజ్ బ్లిస్" అన్నట్టుగా బతకలేడు! ఏదో డాక్టరు గోలీ ఇచ్చిండు అని ఊరకోలేం గా!

౩. ప్రైవేటు సంస్థ అంటేనే "లాభాపేక్ష" అనేది అందులో ఉన్నది; కాబట్టి "లాభాపేక్ష" లేని వ్యవస్థలు తయారు కావాలి - అది ప్రభుత్వం ఐనా, మరోటైనా........ఎఫక్టివ్ డెలివరీ, ఎఫిషియన్సీ ని దెబ్బ తీయకుండా - "లాభాపేక్ష" లేకుండా నడవగలిగే - సర్ప్లెస్ క్రియేటర్ బట్ నాన్ ప్రాఫిట్ మేకింగ్. అవసరం; అలాగే ప్రాఫిట్ మేకింగ్ వ్యవస్థ కూడా ఉండాలి, లేక పోతే అభివృద్ధి జరగకపోవచ్చు. రీసెర్చ్ నీడ్స్ ఫండింగ్!

Anonymous said...

నిజానికి ఆ మధ్య చాలా మంది బలంగా నమ్మింది ఏంటంటే :
మన మెడికిల్ ఫెసిలిటీస్ బాగు పడ్డాయి గాబట్టి, మనం దీన్ని ఎగుమతి చేద్దాం అని...అంటే విదేసీ రోగులకు ఇక్కడ సేవలందిస్తాం; అక్కడివాళ్ళ కంటే ఇక్కడి చీపుగా దొరుకుతున్నందుకు వాళ్ళు ఇక్కడికి వస్తారు; అక్కడి ఇంసూరెన్స్ కంపీనలు ప్రజలని ఇక్కడకు పంపించే విధంగా డీల్స్ చేసుకోవచ్చు....మనం మాత్రం దండుకుంటాం......తద్వారా మన హాస్పిటళ్ళు మంచి ప్రాఫిట్స్ చేసుకోవచ్చు........నిజానికి ప్రైవేటు రంగం ఆలోచించవలసిన పద్దతి అది..........మన నర్సింగ్ స్టాఫ్ ని చాలా బాగు చేయాలి..........దానికి పెడ్డుబడులు నిజానికి ఈ హాస్పిటల వాళ్ళె పెట్టుకోవాలిగాని.....ది లెస్ సెడ్ ది బెటార్......

అందుచేత, ప్రైవేటు రంగం , ప్రభుత్వ "ఆరోగ్యశ్రీ" నుంచి దండుకోవటం నిజానికి అస్సలు క్షమార్హం కాదు...ఇది దోపిడీనే....ఐ హోప్ యూ గెట్ మై పాయింట్...

పైన చెప్పినట్టు ప్రైవేటు రంగం లాభ పడి,అందులో కొంత ప్రభుత్వానికిస్తే...వివిధ పన్నుల రూపేణా,etc..దాన్ని ప్రభుత్వం ప్రజలపై ఉచిత వైద్యానికి ఖర్చు పెట్టవచ్చు..ప్రైవేటు రంగం తన లాభాపేక్షకే ఆరోగ్యశ్రీ ని వాడుకుంటోంది అనే దాంట్లో నాకు సందేహమే లేదు..

పోనీ.....ఎలాగూ ఆరోగ్యశ్రీలో డబ్బులు ఇస్తున్నాం అని...వాళ్ళ లాభాల మీద టాక్సేస్తే.......వాళ్ళు చచ్చినా లాభాలు చూపించరు........

ఇలా చాలా కారణాల వల్ల, "ఆరోగ్యశ్రీ" నిజానికి "ఆరోగ్యదాయకం" కాదు...చాలా కొద్ది మంది మాత్రమే దీని వల్ల లాభపడబోతున్నారు....."కొద్ది మంది" కే దొరికేదైతే ఇంకెంత అవినీతి పెరిగిపోబోతోంది నేను చెప్పక్కర్లేదు.....

teresa said...

ముట్టుకుంటారనే చెప్తున్నది..ER లో కొచ్చే ఏJohn Doeకైనా హైటెక్కూ, లోటెక్కూ
అనే తేడా లేకుండా అవసరమైన కేర్‌ సవ్యంగా సకాలంలో దొరుకుతుంది. ఆ వ్యక్తికి ఇంసూరెంస్‌ ఉన్నదా, లేదా అనే సమాచరం తెల్సుకోడం కోసం జాప్యం చెయ్యబడదు.

భావన said...

నిజమే మహేష్ మీరన్న దానిలోకూడా నిజం వుంది.. హైటెక్ సర్వీసెస్ అని మీరు ఏ వుద్దేశం లో అన్నారో కాని కొన్ని హైటెక్ సర్వీసెస్ వుదాహరణకు ఫెర్టిలిటి ప్రాసెస్స్ , కాన్సర్ ట్రీట్మెంట్ లో అడ్వాన్సెడ్ ట్రీట్మెంట్ ఇన్స్యూరెన్స్ లేని వారికి (ఇన్స్యూరెన్స్ లేక పోవటం అనేదానికి పేదరికానికి .. మద్యతరగతి కి... సంబంధం లేదు) ఇవ్వరు, వున్నవారికి కూడా కొన్ని ప్రత్యేక పరిమితులలో వుంటే అందుకోలేనంత వుంటాయి. కొన్ని ఫేన్సీ విషయాలు కుదరవు ...... అక్కడే రాయ్ రాజ్ గారన్నట్లు మన ప్రైవేటు వైద్యులు దానిలో లాభం పొందాలని ప్రయత్నిస్తారు అనుకుంటా..
@రాయ్ రాజ్
"ప్రైవేటు సంస్థ అంటేనే "లాభాపేక్ష" అనేది అందులో ఉన్నది; కాబట్టి "లాభాపేక్ష" లేని వ్యవస్థలు తయారు కావాలి -" మీరు మరీ అండి ఇంకా నయం రామ రాజ్యం రావాలి అన్నారు కాదు.. అంటే ఇది కూడా ఇంచుమించు గా అంత ఆశ అనిపిస్తోంది (వూరికే బాగుందని వాడేను రామ రాజ్యం అనే పదం మళ్ళీ దానికి నా మీద యుద్దం ప్రకటించకండి మహా ప్రభో) :-)

వెన్నెల రాజ్యం said...

ఆరోగ్యకరమైన చర్చ అంటే ఇదీ..

కత్తి మహేష్ కుమార్ said...

@భావన:మైఖల్ మూర్ తీసిన SICKO అనే డాక్యుమెంటరీ చూడండి. ఇన్స్యూరెన్స్ కంపెనీలు తమ క్లైయింట్లను పెట్టే ఇబ్బందిని, అమెరికన్ వైద్యరంగంలోని అసమానతల్ని చాలా బాగా ఎత్తి చూపే డాక్యుమెంటరీ ఇది.
మీరు ఒకవేళ అమెరికాలో ఉంటే ఈ డాక్యుమెంటరీని ఫ్రీగా తన వెబ్ సైట్లోంచీ చూడొచ్చు (www.michaelmoore.com). నాదగ్గర ఈ ఫిల్మ్ ఉంది. హైదరాబాద్ లో ఉండేవాళ్ళకు నేను ఇవ్వగలను.

@వెన్నెల రాజ్యం:ఈ టపాపై వ్యాఖ్యానించాలంటే కొంత మానవత్వం సామాజికస్పృహ కావాలి. రామాయణం మహాభారతాల గురించి చర్చించాలంటే గుడ్డినమ్మకం ఉంటే చాలు.అందుకే ఈ టపాలో ‘ఆరోగ్య’కరమైన చర్చే జరుగుతుంది. ఎందుకంటే "నమ్మకస్తులు" పనికొచ్చే విషయాల్లో వేలు పెట్టరు.

రాకేశ్వర రావు said...

Bravo. The kind of articles expected from KMK.

ఆరోగ్యశ్రీ నిజంగా జనాకర్షన పథకం. It is extremely short-sighted.

నేనూ ఎన్నాళ్ళగానో ఆరోగ్యశ్రీ గుఱించి ఆలోచించే తీఱును సవివరంగా ఆవిష్కరించారు.

ఆరోగ్యశ్రీ గఱించి ఈ ప్రశ్నలకు జవాబు ప్రజలు (ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి వీరాభిమానులు) వెతుక్కోవాలి.
౧) ప్రభుత్వ డబ్బుతో ప్రైవేటు సంస్థలు ఎందుకు లాభ పడాలి. ప్రైవేటు సంస్థలు ఎంత లాభాపేక్షతో నడుస్తాయో అందరికీ తెలిసిందే.
౨) ప్రభుత్వ ఆసుపత్రుల భవిష్యత్తు ఏంటి? వాటి పునరుద్ధరణకై ఖర్చు చేయడానికి డబ్బు ఎక్కడినుండి వస్తుంది?
౩) ప్రైవేటు వారి బిల్లులు ఇంకెన్నాళ్ళు మన ప్రభుత్వం ఎంతో విలువైన భూములనమ్మి ఇస్తూవుండగలదు?

ఆరోగ్యశ్రీ in its current form is one of those short sighted schemes that get you great votes in a Democracy. It might even remain in the annals of history as a good case-study for "anti illiterate-vote based" democracies.

ఇక్కడ మనం మన రాజకీయనాయకులను అడగవలసిన అసలు ప్రశ్న,
మన ప్రభుత్వ రంగ ఆసుపత్రులు గత కొన్ని దశాబ్దాలలో ఎందుకు ఇంత వాసి కోల్పోయినవి?రాకేశ్వర.

Once again, good article.

బొల్లోజు బాబా said...

OK THEN WHAT IS THE ALTERNATIVE.

DONT SAY GOVERNMENT HOSPITALS ARE TO BE EQUIPPED WELL OVER NIGHT.

కత్తి మహేష్ కుమార్ said...

@బాబాగారు: చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ సమస్యలకు సమాధానం బహుముఖం. వాటిల్లో కొన్నింటిని స్థూలంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను.

సంస్కరణ అంటే మనకు చేతకాదని ప్రైవేటురంగానికి అప్పజప్పడం అనే అర్థంలో ప్రస్తుతం ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. అలా కాకుండా సంస్థాగత,వ్యవస్థాగత సంస్కరణల్ని వైద్య,ఆరోగ్యరంగ సంస్కరణల్లో భాగం చెయ్యాలి. అంతేకాకుండా,ఒక విస్తృతమైన ప్రణాళిక ప్రకారం ఈ సంస్కరణల్ని అమలు జరపాలి.

ప్రైవేటు రంగంలోని యాజమాన్యపరమైన నైపుణ్యాన్ని,డాక్టర్లకిచ్చే incentive లనూ ప్రభుత్వ రంగంలో అమలు జరపగలగాలి. ప్రస్తుతానికి ప్రైవేటు భాగస్వామ్యంతో కార్యక్రమం అమలు జరిపినా, ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఈ సేవలు ఎప్పటిలోగా అందించగలవు అనే ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి.

నెదర్లాండ్స్ వంటి దేశాలలో ఉండే purchaser-provider model ని సేవ,యాజమాన్యం వేరువేరుగా ఉండే వైద్యరంగంలో అమలు చెయ్యటం ద్వారా మరింత efficiencyని తీసుకురావచ్చు.

ఇప్పటికే National Rural Health Mission ప్రాధమిక వైద్యశాలల నుంచీ జిల్లా రెఫరల్ ఆసుపత్రులవరకూ ఉన్న basic infrastructure సమస్యల్ని తీర్చే బృహత్ పథకాన్ని అమలు చేస్తోంది. ఇదే అదనుగా తీసుకుని రాష్ట్ర తన తరఫునుంచీ ఈ రంగాని కేటాయించే బడ్జెట్ ను తగ్గించడమో లేక ఆరోగ్యశ్రీ లాంటి dubious కార్యక్రమాలకు మరలించడమో చెయ్యకుండా, తమదైన development plan ఒకటి తయారు చెయ్యాలి.వచ్చే 15 సంవత్సరాలలో అన్ని జిల్లాస్థాయి ఆసుపత్రులనూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరగాలి.

ఇప్పటివరకూ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకుంటే ప్రస్తుతానికి
4,642 ఆపరేషన్లు జరిగాయి. వీటిల్లో కేవలం 227 మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగాయి. నిమ్స్ లాంటి ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కేవలం 3 ఆపరేషన్లు జరిగాయంటే నమ్మగలరా! అంటే పూర్తి స్థాయి ఫెసిలిటీలు ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోకూడా ఆరోగ్యశ్రీ ఆపరేషన్లు జరగటం లేదు. దీన్నిబట్టి ప్రభుత్వం యొక్క అంతర్లీన ఉద్దేశం తేటతెల్లం.Lets be careful and watchful. లేకపోతే ఇంతే సంగతులు.

బొల్లోజు బాబా said...

బాగున్నాయి
ప్రభుత్వరంగం పట్ల ఉద్యోగుల/ప్రజల/రాజకీయనాయకుల మైండ్ సెట్ మారే అవకాశాలు రోజురోజుకీ తగ్గిపోతున్నాయి.
అ. ఉద్యోగులలో ఒకరకమైన నిర్లిప్తత ఆవరించుకొని ఉంది. ఎగిరెగిరి దంచినా ఒకటే కూలి (డబ్బులే కాదు), ఎగరకుండా దంచినా ఒకటే కూలి అన్న భావన.

ఆ. ప్రభుత్వరంగ సేవలు తక్కువరకానికి చెందినవి, ప్రైవేటు సేవలు బాధ్యతతో కూడినవనీ, స్టేటస్ సింబల్ గానూ (అక్కడ శవాలకు వైద్యం చేసి డబ్బులుగుంజినా సరే - ఇది సినిమా విషయం కాదు ఒక ప్రముఖ ఆసుపత్రిలో మా బంధువులకు జరిగిన ఉదంతం పట్ల నా ప్రగాఢ అనుమానం) వంటి అభిప్రాయాలు ప్రజలో బలంగా పాతుకుపోతున్నవి. ఈ విషయమంలో రెండువైపుల వాదనలనూ కాదనలేని పరిస్థితి నెలకొనిఉన్నది.

ఇ. ఇక రాజకీయనాయకుల చిత్తశుద్ది గురించి చెప్పుకోనక్కరలేదు. మీ వ్యాసంలో తూర్పారపెట్టింది ఒక టిప్ ఆఫ్ ది ఐస్ బెర్గ్ మాత్రమే.

భావన said...

మహేష్ తప్పకుండా చూస్తాను. నేను అమెరికా లోనే వుంటాను, web site లో చూస్తాను. థ్యాంక్స్.
"తమదైన development plan ఒకటి తయారు చెయ్యాలి.వచ్చే 15 సంవత్సరాలలో అన్ని జిల్లాస్థాయి ఆసుపత్రులనూ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరగాలి."
15 సవత్సరాలు ఏ రాజకీయనాయకుడు అంత చిత్తశుద్దితో చేస్తాడు అండీ. ఏదైనా వాళ్ళకు వాళ్ళ బంధు ఆశ్రిత మిత్ర బృందానికి ఇబ్బంది రాకుండా 3 సవత్సరాలలో ఫలితం కనిపించి మళ్ళీ ఓట్లు అడుక్కునే కాలానికి వుపయోగ పడే పధకం ఏదైనా వుంటే చెప్పండి చేస్తారు ఈ రాజకీయ నాయకులు. :-)

Anonymous said...

మంచి పోస్ట్. అమెరికాలోని పరిస్థితి గురించి ఈ మంచి ఆర్టికల్ చదవగలరు:
http://www.newyorker.com/reporting/2009/06/01/090601fa_fact_gawande?currentPage=all