Monday, May 4, 2009

మునెమ్మ పై ఒక స్థానిక పాఠకుడి (native reader) స్పందన -2


మొదటి భాగం ఇక్కడ చదవండి...

మా చిత్తూరు పల్లెల్లో కథలు చెప్పే వాళ్ళు ఇంటికొకరూ వీధికొ్కరూ ఉంటారు. మునెమ్మ కథ చెప్పే 'సినబ్బ' కూడా అలాంటి సిన్నోడే. తనుజెప్పేదాంట్లో నిజమెంతుంటుందో ఊహా అంతే ఉంటుంది.విషయమెంతుంటుందో అలవికాని వివరమూ అంతే ఉంటుంది. కతెంతుంటుందో కతకు ఏ సంబంధమూలేని మెట్టవేదాంతమూ అంతే ఉంటుంది. ఇవన్నీ కథ చెప్పే కిటుకులోని భాగాలు. కథను మరింత రసవత్తం చేసే అంశాలు.ఆద్యంతం శ్రోతలు లేక పాఠకుల ఆసక్తిని నిలిపే విషయాలు. అందుకే, ఒక పాఠకుడిగా, సినబ్బ చేత కథచెప్పించిన రచయితకన్నా కథ చెప్పిన సినబ్బ నాకు ముఖ్యం.

ఇరవైఏళ్ళ సినబ్బ. మునెమ్మ ఆక్కో,వదినో తెలీని సినబ్బ. కల తరువాత మునెమ్మలోని మార్పునిచూసి అబ్బురపడిన సినబ్బ. మునెమ్మ సాహసొపెతమైన ప్రయాణంలో కలిసి ప్రయాణించిన సినబ్బ. మునెమ్మ సాహసాన్ని కళ్ళప్పగించి
చూసిన సినబ్బ. మునెమ్మ వృత్తాంతాన్ని అభిమానంగా, గర్వంగా, ప్రేమగా తనదైన రీతిలో చెప్పేప్రయత్నంలో మునెమ్మని ఒక శక్తిలా ఆరాధించాడు, ఒక దేవతలా పూజించాడు.బహుశా ప్రేమించాడుకూడా. కథకుడికి ఇలాంటి అద్వితీయ భావనే లేకపోతే కథలో ఇంత సాధికారత రాదు. అదే కల్లాకపటం లేని రాయలసీమ నేల మహత్యం. ఆ ప్రాంతపు కథా సంస్కృతికి చిహ్నం.

చిన్నప్పుడు మా పల్లెలో ఎవరైనా కుటుంబ పెద్దలు లేక గ్రామ ప్రముఖులు చనిపోతే, వాళ్ళ దినాలకు కథపెట్టించేవాళ్ళు. ఆ కథ చనిపోయిన మనిషి గురించుండేది. మా తాతగారు చనిపోయినప్పుడు ఆ కథకుల్ని ఉస్తికాయలపెంట,పాకాల లేకపోతే కంగుంది కుప్పం నుంచీ పిలిపించారు. అప్పుడు నా వయసు ఏడెనిమిదేళ్ళుంటుందేమో. పదకొండో రోజు కథైతే కథకులు నాలుగు రోజుల ముందే వచ్చేసారు. బంధువర్గంలో కలిసిపోయి ఆమాటా ఈ మాటా సేకరించారు. పదకొండో రోజు వాళ్ళు కథ చెబితే...కేవలం ముసలివాడిగానే నాకు తెలిసిన మా తాతగారి బాల్యం నాముందు ఆవిష్కృతమయ్యింది. యవ్వనంలో అతని వేట సాహసాలు విదితమయ్యాయి. వ్యక్తిగా,కుటుంబ పెద్దగా, గ్రామంలో ప్రముఖుడిగా తను చేసిన పనులు చెబుతుంటే మా తాతగారికన్నా గొప్ప వ్యక్తి ఆ చుట్టుపక్కల ఎవరూ లేరనిపించింది. అ కథకులు చెప్పినదాంట్లో ఎంత నిజముంది, ఎంత కల్పనుంది అనేది నాకు అప్రస్తుతమయ్యాయి. కథ చెప్పిన తీరు.కథ చెప్పిన ఉద్దేశం. కథద్వారా కథకులు శ్రోతల్లో కలిగించిన రసస్పందన. ఇవే ముఖ్యం. బహుశా అందుకే రసస్పందనలో తర్కం కూడదంటారేమో!

పాఠకుడి ఉద్దేశం రసస్పందన.పాఠకుడికి సాహితీవిమర్శ తెలీదు. తన అనుభవాల్లోంచీ కథను అర్థం చేసుకుని అనుభవించి ఆనందిస్తాడు. విమర్శకుడు అలా కాదు. తను కథ ఔచిత్యాన్ని, సార్థకతనూ,సామాజిక అర్ధవంతతనూ తమ
దగ్గరున్న పనిముట్లతో బేరీజు చేస్తాడు. అంటే రసస్పందనలో తర్కాన్ని ఆశిస్తాడు. కాబట్టి ఒక స్థానికుడిగా నేను ఇటువంటి కథకుడు (సినబ్బ) చెప్పే ఇతివృత్తంలో అతడి సమర్పణభావాన్ని చూసానేకానీ,సాధ్యాసాధ్యాలను కాదు. పాఠకుడిగా కథద్వారా కలిగిన రసస్పందనని ఆస్వాదించానేగానీ తర్కాన్నిశోధించలేదు. అందుకే ఒక స్థానిక పాఠకుడిగా నాకు జవాబుల్లేని ప్రశ్నకి సమాధానాలు లభించాయి.

మూడవ భాగం త్వరలో...

****

9 comments:

Anonymous said...

మీరు మునెమ్మ కధ కు "ఒక స్థానిక పాఠకుడిగా,రాయలసీమ వాసిగా" నే మీ ప్రస్తుత వ్యాస పరంపర కొనసాగుతున్నది.

మీ యీ "పాఠకుడికి సాహితీవిమర్శ తెలీదు," అన్న అభిప్రాయంతో ఎంత మంది ఏకిభవిస్తారో?

సుజాత వేల్పూరి said...

"పాఠకుడికి సాహితీ విమర్శ తెలీదు" అందరి విషయంలోనూ వర్తిస్తుందా ఇది?

విమర్శకులుఒక రచనను కేవలం విమర్శనా దృష్టితో చదవడం వల్ల, లోపాలను ఎత్తి చూపించే ఆత్రుతలో భాగంగా ఈ స్థానికత మొదలైన విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి విషయాలను పరిగణనలోకి తీసుకోరంటారా? ఎంచేత?

అంచేతనే మునెమ్మ కాత్యాయని చేత అంత అర్థం లేని దారుణమైన (తీవ్ర ఆరోపణలతో కూడిన)విమర్శకు గురైందా?

మూడో భాగం "త్వరలో"...ఏమిటి? మధ్యాహ్నం అని ఉండాలి. త్వరగా రాయండి. ఇంతింత చిన్న చిన్న భాగాలు రాస్తున్నారేమిటి?

కత్తి మహేష్ కుమార్ said...

@సుజాత & అనిల్:చైతన్యవంతమైన పాఠకుడు సాహిత్యంతో తనదైన సంబంధాన్ని ఏర్పరుచుకుంటాడు. అది సాహితీవిమర్శంత objective గా ఉండదు. ఆ తాదాత్మ్యత ఉచ్చస్థాయిలో ఉన్నప్పుడు పాఠకుడు విమర్శకుడు చూడని,ఆలోచించని కోణాల్ని అనుభవించగలడు. కానీ, అందరు పాఠకులూ ఆ అనుభవాన్ని అక్షరీకరించలేకపోవచ్చు.ఒకవేళ అక్షరీకరించినా, విమర్శకుల తులమానాలు ఆ అనుభవాలకు వర్తించకపోవచ్చు. అందుకే పాఠకుడికి "సాహితీవిమర్శ" తెలీదు అన్నాను.

కాత్యాయని దృష్టి గురించి చెప్పాలంటే "ఆధునిక నగరీయ సౌదర్యరాహిత్యం" అనే అంశాన్ని గురించి కూలంకషంగా చర్చించాలి. కేశవరెడ్డి ఎలాగూ "they mean nothing to me" అనేశారు కాబట్టి, కాత్యాయని విమర్శను నేను బుట్టదాఖలు చేసేశాను.

మూడోభాగం బుధవారం ఒకేసారి మొత్తంగా పెడుతున్నాను. కాబట్టి కొంత ఎదురుచూపులు తప్పవు.

సుజాత వేల్పూరి said...

కాత్యాయని విమర్శ గురించి కేశవ రెడ్డిగారేమంటారో ఆయన ఇష్టం! కానీ రచయిత పట్ల దాదాపుగా ఒక వ్యక్తిగత ఆరోపణలాగా సాగిన ఆ విమర్శకు,స్త్రీల పట్ల ఆయనకు లేని విరోధ భావాన్ని ఆయనకు అంటగట్టిన ఆ విమర్శకు ఒక native reader గా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? తనను సమర్థించుకోడానికి మరో ఇద్దరు డాక్టర్లను కూడా వెంట తెచ్చుకుని తన వాదనకు బలం చేకూర్చుకో ప్రయత్నించారు కూదా ఆమె! ఆ విమర్శను మీరు బుట్ట దాఖలు చేయడం ఏమీ బాగాలేదు. అసలు కాత్యాయనే అంత విమర్శను రాయకపోతే మీరు ఇన్నిసార్లు మునెమ్మ నవల గురించి రాసేవారా చెప్పండి?

Anonymous said...

అలగైతే, " ప్రతి పాఠకుడికి.." అని ఉండాలేమో?!

శరత్ కాలమ్ said...

మునెమ్మ మీది మీ టపాలు చదువుతుంటే నాకూ మునెమ్మ చదవాలని వుంది కానీ ఇక్కడ దొరకదు కదా. ఈ సారి ఇండియా వచ్చినప్పుడు తీసుకుంటాను.

Naga said...

@శరత్ బాబు: పుస్తకం వెల అచ్చరాలా తొంభై సెంట్లు.. అవ్వ...

http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=8849

Kathi Mahesh Kumar said...

@సుజాత: కాత్యాయనికి నవల అవసరమైనంత అర్థం కాకపోవడానికి తన limitations కారణం. తను విమర్శించిన విషయాల futility మీద నా విశ్లేషణలో కొంత పేర్కొంటున్నాను. చూడండి.

@శరత్: మీ అడ్రస్ నాకు మెయిల్ చెయ్యండి. మునెమ్మ నేను మీకు పంపుతాను.

Vinay Chakravarthi.Gogineni said...

kattigaaru doubt........

vimarsakudu eppudu edo tappu choopinchaalani try chestadaaa....alanti vallu correct vimrsakudu kaademo.......

vimarsakudiki saamanya paatakudikante ekkuvateliyaalani antaanu........nenu.....endukante neeku nachhina vidham neevu imagin chesukuntavu kadhani ..but critic..ala kaadukada..even raasevadikante critic ekkuva..knowledge vundaali kada.........